ప్రతి ఒక్కరి జీవితాన్ని సముద్రంతో పోల్చుతుంటాం. ఎన్నో ఆటుపోట్లతో కూడుకున్న మనిషి జీవితం ఒక్కొక్క దరిని చేరుతుంటుంది. అయితే ఓటమి ఎదురైనప్పుడు మనిషి నిరాశ, నిస్పృహలతో కుండిపోకుండా ముందుకు సాగాలనే జీవిత సత్యాన్ని తెలియజేసేదే ‘సముద్రం’. సముద్రంలో అలలు తీరాన్ని తాకడానికి ముందు అనేక ఆటు పోట్లు ఎదుర్కొని ఉవ్వెతున్న లేస్తాయి. అలాగే కిందకి పడిపోతుంటాయి. ఇలాంటి ఒడిదొడుకులు కూడా జీవితంలో సహజం, అయితే మనిషి ఓటమి ఎదురైన ప్రతిసారి కుంగిపోకుండా ప్రయత్నం చేయాలి. అప్పుడే ఉవ్వెత్తున ఎగిసే అలలా పైకెదుగుతాడు. ఇది ఎవరూ కాదనలేని జీవిత సత్యం. దీన్ని విజ్ఞులు మనకు అనేక సందర్భాల్లో చెబుతుంటారు. అలాంటి జీవిత సత్యాన్ని ఆధారంగా చేసుకుని హీరో, నటుడు జగపతిబాబు ఆటో బయోగ్రఫీతో ‘సముద్రం’ అనే ధారావాహిక ప్రసారం కానుంది. పదమూడు ఎపిసోడ్లతో ఈ సీరియల్ ప్రసారం కానుంది. హీరోగా కెరీర్‌ను ప్రారంభించిన జగపతిబాబు తన సినీ గమనంలో ఎన్నో ఎత్తు పల్లాను చూశారు. అయితే ఆయన ఓటములకు కుంగిపోలేదు. ప్రయత్నం చేశాడు..చేస్తూనే ఉన్నాడు. అందుకే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఉత్తమ నటుడుగా నిలిచిపోయారు. జగపతిబాబు జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా రానున్న ఈ ధారావాహిక ఆయన నేపథ్యం నుండి ప్రారంభం అవుతుంది. హీరోగా ఆయన సాధించిన సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్, సమాజంలో, రియల్ లైఫ్ లో జగపతిబాబు ఎలా ఉంటారు?, రీల్ లైఫ్ లో ఎలా ఉంటారు? వంటి చాలా విషయాలు ఆయన స్వయంగా వివరిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇంత వరకు ఇండియన్ సినీ హిస్టరీలో ఏ హీరో చేయని ప్రయోగమిది అనాలి. ఈ ‘సముద్రం’ ధారావాహికకు సినీ జర్నలిస్ట్ వంశీ చంద్ర వట్టికూటి రచయిత. ‘మ్యాంగో’ వంశీ నిర్మాణ, నిర్వహణ బాధ్యతను చూస్తారు. ఈ కార్యక్రమాన్ని ఓ ప్రముఖ టీవీ ఛానెల్ ప్రసారం చేయనుంది.
tags:Jagapathi Babu, news, samudram,jagapathibabu auto biography